రాజధాని పల్లెకు పట్టాభిషేకం
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలనూ అత్యాధునిక జనావాసాలుగా తీర్చిదిద్దే దిశగా సీఆర్‌డీఏ ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేసిన ఈ సంస్థ త్వరలోనే అధునాతన వసతులన్నింటినీ రాజధాని గ్రామాల్లో నెలకొల్పేందుకు సమాయత్తమవుతోంది.
నీటిని కలుషితం చేయడం ద్వారా ఆరోగ్యానికి హాని కలుగజేసే అవకాశాన్ని పూర్తిగా నిరోధించగలిగిన పకడ్బందీ పైపులైన్ల వ్యవస్థను నెలకొల్పనున్నారు. తాగునీటి పైపుల్లో ప్రవహించే నీరు సైతం అధిక ప్రెషర్‌తో సరఫరా అయ్యేలా చూడాలని భావిస్తోంది. మంచినీరు, డ్రైనేజీ పైపులైన్లను తగినంత దూరంలో ఏర్పాటు చేసేందుకూ యోచిస్తోంది.
అన్నీ భూగర్భంలోనే..
ఓపెన డ్రెయిన్లు కనిపించకుండా భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తాగునీటి పైపులైన్లు, విద్యుత్తు, గ్యాస్, టెలిఫోన్లు.. ఇత్యాదివన్నింటినీ భూగర్భంలోనే ఏర్పాటు చేయనుంది.
వంద శాతం శుద్ధి లక్ష్యం..
మురుగునీటితోపాటు వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి పరచే లక్ష్యంతో ప్రపంచస్థాయి ట్రీట్‌మెంట్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు. శుద్ధి పరచిన తర్వాత కూడా వాటిని తాగునీటి వనరుల్లో కలుపకుండా ఆ నీటిని అగ్నిమాపకశాఖ ప్రమాద సమయాల్లో ఉపయోగించుకునేందుకు, మొక్కలను పెంచేందుకు వినియోగించనున్నారు.
ఇంటింటికీ ఇంకుడుగుంత..
వర్షపు నీటిని సమర్ధంగా ఒడిసి పట్టేందుకుగాను ప్రతి ఇంటిలోనూ ఇంకుడుగుంతను ఏర్పాటు చేసేలా చూడనున్నారని తెలుస్తోంది. డ్రెనేజీ మ్యాన్‌హోల్‌పై అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారయ్యే మూతలను వాడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇనుప మూతలకంటే కొంచెం ఎక్కువ ఖరీదైనప్పటికీ వీటినే వాడాలని భావిస్తున్నారని సమాచారం.
విశాలమైన, సుందరమైన రహదారులు..
రాజధాని గ్రామాల్లోని ప్రధాన, అంతర్గత రహదారులను తీర్చిదిద్దనున్నారు. వీటిని స్థానిక అవసరాలకు, రాజధాని స్వరూప స్వభావాలకు అనుగుణంగా విశాలంగా నిర్మించనున్నారు. పచ్చదనంతో కూడిన డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ వ్యవస్థ, ఇరుపక్కలా ఫుట్‌పాతలు, సైక్లింగ్ ట్రాక్‌లు, కనువిందు చేసే పచ్చదనం ఇత్యాది అధునాతన సౌకర్యాలతో ఇవి ఏర్పడనున్నాయి.
మూడు యూనిట్లుగా విభజన..
రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలను మూడు యూనిట్లుగా (ఒక్కొక్కదానికి దాదాపు 10 చొప్పున) విభజించింది. మందడం, అనంతవరం, నెక్కొల్లు కేంద్రాలుగా ఏర్పడిన యూనిట్లలో మందడం పరిధిలోని గ్రామాల్లో సర్వే ప్రక్రియ మొదలుకానుంది. మిగిలిన రెండింట్లో ఇప్పటికే ప్రారంభమైంది. ఆయా గ్రామాల భౌగోళిక స్వరూపం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, రహదారులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, నీటి వనరుల పరిస్థితి అంశాలపై పరిశీలన చేయిస్తోంది. ఆర్వీ అసోసియేట్స్ సిబ్బంది ప్రతి గ్రామంలోనూ వివరాలను సేకరిస్తున్నారు.


No comments:
Post a Comment