అమరావతికిసర్క్యులర్ రైలు
రాజధాని నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు వచ్చేంత వరకు ప్రత్యామ్నాయంగా సర్క్యులర్ రైళ్లను నడపాలని కేంద్రం యోచిస్తోంది. గుంటూరు - అమరావతి - విజయవాడ మధ్యన రైళ్లను నడపడం ద్వారా రాజధాని ప్రజల రవాణా అవసరాలు తీర్చవచ్చని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన రైల్వేబోర్డుకు కూడా నివేదించారు. బోర్డు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు ఆయన ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధులకు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ వచ్చే ఏడాది లోపు అమరావతికి తరలిరానున్నాయి. విజయవాడ, గుంటూరు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ఇంచుమించు లక్ష మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు ఈ మూడు ప్రాంతాలకు వస్తే రవాణా వ్యవస్థలపై భారం పడుతుంది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమైతే ఇక్కడ పని చేయడానికి వచ్చే అధికారులు, కూలీలతో భారం మరింత పెరుగుతుంది. రాజధానిలో జనసాంద్రత పెరిగేంత వరకు మెట్రో రైలు నడపడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విజయవాడ - అమరావతి - గుంటూరు మధ్యన సర్క్యులర్ రైళ్లను నడపాలని కేంద్రం భావిస్తోంది. ఈ విషయంలో మంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రైల్వే బోర్డుతో తరచుగా సంప్రదింపులు కొనసాగిస్తోన్నారు. త్వరలో జరగనున్న బోర్డు సమావేశంలో అమరావతి సర్క్యులర్ రైలు ప్రాజెక్టుపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. బోర్డు నిర్ణయం తీసుకొంటే రానున్న రైల్వే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును చేర్చి నిధులు కేటాయించే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నాయి. రైల్వే పింక్‌బుక్‌లో ప్రాజెక్టు చేరితే త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది

No comments:
Post a Comment